మనస్పర్థలతో ప్రేమికుల జంట ఆత్మహత్య!
కడప, మే 4 (హైదరాబాద్ న్యూస్ టైమ్): కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న యువతీయువకులు చిన్నపాటి మనస్పర్థల కారణంగా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించారు. చెన్నూరు మండలానికి చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల తలెత్తిన విభేదాల కారణంగా మనస్తాపానికి గురై, వేర్వేరు ప్రాంతాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. యోగేంద్ర కుమార్ వర్మ కడప నగరంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఉరివేసుకోగా, హేమశ్రీ చెన్నూరులోని తన సొంత నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఒకే సమయంలో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, వారి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ చేపట్టారు.