మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు తప్పిన ముప్పు!
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతతో పెను ముప్పు తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం మధ్యాహ్నం ముంబై నుండి ముర్బాద్‌కు ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు షిండే తన పార్టీ నేతలతో కలిసి బయలుదేరారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మహాలక్ష్మి రేస్‌కోర్స్ హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. అయితే, ఐరోలి ప్రాంతానికి చేరుకోగానే వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. భారీ తుపాను ముంచుకొస్తున్నట్లు పైలట్ గమనించారు. ముందున్న ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్, వెంటనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరించి ప్రయాణాన్ని రద్దు చేయాలని సూచించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్‌ను వెనక్కి తిప్పి, జుహూలోని పవన్ హన్స్ హెలిప్యాడ్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, షిండేతో సహా హెలికాప్టర్‌లోని వారంతా క్షేమంగా ఉన్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. పైలట్ సమయస్ఫూర్తిని మరియు చాకచక్యాన్ని అధికారులు అభినందించారు. ఈ వార్త తెలియగానే షిండే అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.