మహిళా మృతదేహాల నగ్న ఫొటోలు తీస్తూ అడ్డంగా దొరికిన అటెండెంట్

Published on: 07 Jun 2026, 09:17 AM
News Article
  • కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దారుణం
  • మొబైల్ ఫోన్ పరిశీలనలో బయటపడిన మునీర్ అహ్మద్ ఘాతుకాలు
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు: కఠిన శిక్ష కోసం ప్రజల డిమాండ్

బీదర్, జూన్ 7 (హైదరాబాద్ న్యూస్ టైమ్): చనిపోయిన వారి పట్ల గౌరవం చూపించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అటెండెంట్‌గా పనిచేస్తున్న మునీర్ అహ్మద్, మహిళా మృతదేహాల పట్ల అత్యంత నీచంగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు.

ఘటనా వివరాలు: మార్చురీలో భద్రపరిచిన మహిళా మృతదేహాల దుస్తులను తొలగించి, వారి నగ్న ఫొటోలను తన మొబైల్‌లో చిత్రీకరించడం నిందితుడు అలవాటుగా మార్చుకున్నాడు. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేదా అవసరం లేకపోయినా, పోస్ట్‌మార్టం గదిలో అతను చేస్తున్న ఈ పైశాచిక చర్యలను గమనించిన ఒక వైద్యుడు వెంటనే స్పందించారు. అనుమానం వచ్చి మునీర్ అహ్మద్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో అనేక మహిళా మృతదేహాల నగ్న ఫొటోలు బయటపడటంతో అక్కడి వైద్య సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

కేసు నమోదు.. అరెస్ట్ ఈ ఘటనపై వైద్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మునీర్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. చనిపోయిన మహిళల పట్ల కూడా ఇంతటి అమానుషానికి పాల్పడిన ఇతనిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సైకోలకు సమాజంలో చోటు ఉండకూడదని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దారుణంపై విచారణ కొనసాగుతోంది.