మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
యాదాద్రి భువనగిరి, జూలై 14, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలానికి చెందిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచుల పదవీకాలం ముగిసి 31 నెలలు దాటినా, గ్రామాభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు చేసిన నిధులు ఇంకా అందకపోవడంతో వడ్డీలు చెల్లించలేక అనేకమంది మాజీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి మాజీ సర్పంచులను ఆర్థిక సంక్షోభం నుండి కాపాడి న్యాయం చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.