మాఫియా డాన్ అవ్వాలని.. కన్నతల్లినే 16 పోట్లు పొడిచి చంపిన కసాయి కొడుకు!

Published on: 16 May 2026, 03:20 AM
News Article
  • తొమ్మిదిన్నర తులాల బంగారం కోసం ఘాతుకం..
  • మృతదేహాన్ని కోనేరులో పడేసిన వైనం
  • సినిమా ఫాంటసీతో దారుణానికి ఒడిగట్టిన పదో తరగతి బాలుడు

హైదరాబాద్ న్యూస్ టైమ్, విజయనగరం/రాజాం: విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో కేవలం 16 ఏళ్ల వయసులోనే 'మాఫియా డాన్' అవ్వాలనే వికృత కోరికతో, ఓ బాలుడు తన స్నేహితుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన ముంజేటి సతీష్, స్పందన (34) దంపతుల కుమారుడు స్కూల్లో ఒక అమ్మాయికి ప్రేమలేఖ రాశాడన్న నెపంతో తల్లి మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తండ్రి తమను వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడన్న ఆక్రోశం, ముంబై వెళ్లి పెద్ద మాఫియా డాన్లుగా స్థిరపడదామంటూ స్నేహితుడు ఇచ్చిన ఉసిగొల్పడంతో ఇద్దరూ కలిసి మే 4వ తేదీన ఇల్లంతా వెతికి తొమ్మిదిన్నర తులాల బంగారం, 5 వేల నగదు బ్యాగులో సర్దుకున్నారు. అనంతరం తల్లి ఇంట్లోకి రాగానే స్నేహితుడి సాయంతో కత్తితో ఏకంగా 16 పోట్లు పొడిచి, ఆమె మరణించిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని చీరతో చుట్టి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా కన్నకొడుకే హంతకుడిగా తేలడం, హత్య అనంతరం నిందితులు భువనేశ్వర్, ముంబై, వైజాగ్, తిరుపతి తిరుగుతూ చివరకు పలాసకు వెళ్తుండగా చిలకలపాలెం వద్ద పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకోవడంతో ఈ నరరూప రాక్షసుడి దారుణ కాండ వెలుగుచూసింది.