మావోయిస్టులతో కలిసి ఎస్సై భోజనం.. అసలేం జరిగింది?
కాంకేర్ (ఛత్తీస్‌గఢ్): తుపాకుల మోత వినిపించే అడవిలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శత్రువులని చూడాల్సిన పోలీసులు, మావోయిస్టులు ఒకేచోట కూర్చుని కలిసి భోజనం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా దండకారణ్యంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మానవత్వం చాటుకున్న ఎస్సై:
పార్తాపూర్ ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు కీలక మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్తాపూర్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది, ఎటువంటి భయం లేకుండా స్వయంగా అడవిలోకి వెళ్లారు. కాలినడకన వస్తున్న ఆ ముగ్గురు మావోయిస్టులు ఆకలితో ఉన్నారని తెలుసుకున్న ఎస్సై, వెంటనే వారికోసం భోజన ఏర్పాట్లు చేశారు. వారితో పాటే అడవిలో నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి..
ఎస్సై చూపిన ఆదరణతో ప్రభావితమైన రాధిక కుంజం, సందీప్ కడియం, రైను పద్మ అనే ముగ్గురు మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. హింసను వదిలి సాధారణ జీవితం గడపాలనే వారి నిర్ణయాన్ని జిల్లా యంత్రాంగం స్వాగతించింది. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న ఎస్సైపై ప్రశంసల జల్లు కురుస్తోంది.