మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 7,345 కోట్ల పరిపాలనా అనుమతులు!

Published on: 09 Jul 2026, 10:21 AM
News Article

హైదరాబాద్, జూలై 09, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నగర జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా, ప్రాధాన్య కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. భూసేకరణ వ్యయం మినహాయించి కేటాయించిన ఈ నిధులతో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి.మీ మేర.. మొత్తం 21 కిలోమీటర్ల మేర రివర్‌ఫ్రంట్ పనులను ఈపీసీ (EPC) విధానంలో చేపట్టనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు గాను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి రూ. 4,500 కోట్లు, మిగిలిన రూ. 2,845.12 కోట్లను హెచ్ఎండీఏ/టీజీఐఐసీ ద్వారా రుణంగా సమీకరించనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు పీఎంసీ (PMC) నియామకానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం, ఏడీబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంఆర్డీసీఎల్ (MRDCL)ను ఆదేశించింది.