బారాబంకి, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి ఆగి ఉన్న పికప్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సుబేహా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘెరావాన్ గ్రామం వద్ద ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు ఒక మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ వెనుక నుంచి ఆగి ఉన్న పికప్ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ఇద్దరు డ్రైవర్లతో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.