ఆదిలాబాద్, నవంబర్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మేనత్త కొడుకును ప్రేమించిందన్న కోపంతో కన్నతండ్రే తన కూతురిని కడతేర్చిన దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఆత్మహత్యగా చిత్రీకరించి, ఎవరికీ అనుమానం రాకుండా కేవలం మూడు గంటల్లోనే సాంప్రదాయాలకు విరుద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఈ పరువు హత్య గుట్టు రట్టయింది.
నిశ్చితార్థం ఖరారైన వేళ ప్రేమ విషయం వెల్లడి: నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు తమ కుమార్తె కళ్యాణి (18)కి ఈ నెల 25న వేరే యువకుడితో నిశ్చితార్థం జరిపించేందుకు నిర్ణయించారు. అయితే, ఈ నెల 23వ తేదీన కళ్యాణి తీవ్ర బాధతో ఉండటాన్ని గమనించిన తండ్రి కైలాస్, విషయమేంటని గట్టిగా నిలదీశాడు. దీంతో తాను మేనత్త కొడుకును ప్రేమిస్తున్నానని కళ్యాణి తండ్రికి చెప్పింది. ఈ మాట వినగానే తీవ్ర ఆగ్రహానికి గురైన కైలాస్, పరువు పోతుందన్న కక్షతో కూతురిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
నిద్రలో గొంతు నులిమి.. ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి: అదే రోజు రాత్రి కళ్యాణి గాఢ నిద్రలో ఉండగా కైలాస్ ఆమె గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని పక్క గదిలోకి తీసుకెళ్లి ఉరికి వేలాడదీశాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తల్లి సుమిత్ర, ఉరికి వేలాడుతున్న కూతురిని చూసి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
మూడు గంటల్లోనే దహన సంస్కారాలతో బయటపడ్డ కుట్ర: ఈ ఘటన జరిగిన కేవలం మూడు గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం స్థానికులకు అనుమానం కలిగించింది. ముఖ్యంగా లంబాడ సంస్కృతి ప్రకారం పెళ్లికాని అమ్మాయి మరణిస్తే ఖననం (పూడ్చిపెట్టడం) చేయాలి. కానీ, ఆచారానికి విరుద్ధంగా మృతదేహాన్ని హుటాహుటిన దహనం చేయడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, పరువు పోతుందనే భయంతో తానే కూతురిని హత్య చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.