మైనార్టీ తీరకుండానే పెళ్లి పీటలు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్ర సర్వే!
హైదరాబాద్ న్యూస్‌టైమ్, న్యూఢిల్లీ, జూన్ 08, 2026: దేశంలో చట్టబద్ధమైన వయసు నిండకుండానే అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారనే చేదు నిజం తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రతి వంద మంది అబ్బాయిల్లో దాదాపు 16 మంది (15.9 శాతం) 21 ఏళ్ల వివాహ వయసు నిండకుండానే ఓ ఇంటివారవుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (NFHS)-6' నివేదిక స్పష్టం చేసింది. 2023-24 కాలానికి గానూ నిర్వహించిన ఈ సర్వేలో.. బాల్య వివాహాల ప్రభావం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం మంది అబ్బాయిలు మైనర్లుగానే వివాహం చేసుకుంటుండగా, పట్టణ మరియు నగర ప్రాంతాల్లో ఈ శాతం 9.7 శాతంగా నమోదైంది. చట్టాలు ఉన్నప్పటికీ అవగాహన లోపం, సామాజిక పరిస్థితుల కారణంగానే ఈ మైనర్ వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.