యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు నియామకాలపై కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం..
హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను కనీసం సంప్రదించకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ నియామకాలను ఖరారు చేశారని ఆరోపిస్తూ, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నియామకాల్లో కనీసం మంత్రి కొండా సురేఖను కూడా సంప్రదించలేదనే విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ట్రస్టు బోర్డులో వివేక్ వెంకటస్వామికి ఇప్పటికే మంత్రి పదవి ఉండగా, ఆయన కుమారుడు ఎంపీగా ఉన్న తరుణంలో మళ్లీ వినోద్ వెంకటస్వామికి స్థానం కల్పించడంపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం ఉన్న నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖను బోర్డులో చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మాజీ బీఆర్ఎస్ ఎంపీ సోదరుడు సత్యనారాయణ రెడ్డిని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించడం వివాదానికి మరో ప్రధాన కారణంగా మారింది. ఈ వివాదాన్ని అధిష్టానం తక్షణమే పరిష్కరించకపోతే, ఇది పార్టీలో పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.