యాదగిరిగుట్ట బోర్డు ఎంపికపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి..
హైదరాబాద్, జూలై 01 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అస్సలు బాలేదని మండిపడిన ఆయన.. కావాలనే, తనకు నచ్చకనే నల్గొండలో జరిగిన అధికారిక సభకు వెళ్ళలేదని బహిరంగంగానే స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతా బయట నుండి వచ్చిన వాళ్ళదే నడుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసిహ్మస్వామి ఆలయ బోర్డు ధర్మకర్తల మండలి ఎంపిక వ్యవహారంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేనైన తనకే.. ఈ బోర్డు ధర్మకర్తల మండలి ఎంపిక విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ప్రభుత్వంలోనే జిల్లా ఎమ్మెల్యేలకు కనీస గౌరవం, సమాచారం లేకపోవడంపై ఆయన అసమ్మతి రాగం వినిపించడంతో, ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.