యూపీ దొంగల 'హైటెక్' దోపిడీ

Published on: 30 Mar 2026, 03:44 PM
News Article

గుంటూరు: దొంగతనం చేయడం.. ఆ డబ్బుతో గోవా, సౌదీ అంటూ విహారయాత్రలకు వెళ్లడం.. విలాసవంతమైన జీవితం గడపడం.. ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల స్టైల్. గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన ఎస్పీ వకుల్ జిందాల్, మీడియా వేదికగా నిందితుల వివరాలను వెల్లడించారు.

పట్టపగలే బీరువా బద్దలు..

ఈ నెల 7వ తేదీన లాలాపేట ఇందిరా ప్రియదర్శిని కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఎవరూ లేని సమయం చూసి తాళం విరగ్గొట్టి, బీరువాను బద్దలు కొట్టి ఏకంగా 246 గ్రాముల బంగారం, భారీగా నగదును ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టగా.. యూపీలోని గజియాబాద్ జిల్లాకు చెందిన ఇమ్రాన్ (40), రషీద్ (38) లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.

స్వాధీనం చేసుకున్న సొత్తు:

నిందితుల నుంచి పోలీసులు రికార్డు స్థాయిలో రికవరీ చేశారు:

  • 246 గ్రాముల బంగారు ఆభరణాలు.
  • 136 గ్రాముల గోల్డ్ పీసెస్.
  • 132 చిన్న చిన్న వజ్రాలు.
  • నాలుగు లక్షల రూపాయల నగదు.

దొంగతనం సొమ్ముతో జల్సాలు..

ఈ దొంగల గురించి విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరికీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, పెద్దాపురం, యానాం ప్రాంతాల్లో కూడా పాత నేర చరిత్ర ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన సొమ్ముతో వీరు కేవలం విలాసాల కోసమే ఖర్చు చేస్తారని, సౌదీ, గోవా, ముస్సోరి వంటి ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తుంటారని ఎస్పీ వెల్లడించారు.