హైదరాబాద్, సెప్టెంబర్ 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వ్యాపారులకు చేసే యూపీఐ పేమెంట్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యాపారులకు రూ. 2,000 ఆపై జరిగే పేమెంట్స్‌పై 0.40 శాతం ఎండీఆర్ ఛార్జీని ఎన్పీసీఐ ఖరారు చేసింది. దీని ప్రకారం.. రూ. 2,000 పేమెంట్‌కు రూ. 4, రూ. 3,000 పేమెంట్‌కు రూ. 12, రూ. 50,000 పేమెంట్‌కు రూ. 200, అలాగే రూ. 75,000 మరియు అంతకంటే ఎక్కువ మొత్తాలపై రూ. 300 వరకు ఛార్జీ వసూలు చేయనున్నారు.
విభాగాల వారీగా ఛార్జీల వివరాలు:
- ఫ్యూయల్, రైల్వే, బీమా సేవలు: రైల్వే, టెలికాం సేవలు, బీమా, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ విభాగాల్లో రూ. 2,000 దాటిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి ఫిక్స్‌డ్‌గా రూ. 5 ఎండీఆర్ వసూలు చేస్తారు.
- ఇతర లావాదేవీలు: ఇతర విభాగాల్లో రూ. 2,000 దాటిన మొత్తాలపై 0.40 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది.
- స్టాక్స్ & మ్యూచువల్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు మరియు డీలర్లకు మాత్రం కేవలం 0.02 శాతం ఎండీఆర్ అమలు చేయనున్నారు.