రాఖీ పండుగ రోజే విషాదం.. యువకున్ని దారుణంగా కొట్టి చంపిన MK గ్యాంగ్
మణుగూరు, ఆగస్ట్ 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సంతోషంగా జరుపుకోవాల్సిన రాఖీ పండుగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగ కోసం హైదరాబాద్ నుండి సొంతూరికి వచ్చిన ఓ యువకుడిని మణుగూరుకు చెందిన అరాచక 'కాందర్ (MK) గ్రూప్' సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పండుగ రోజు అన్న ప్రాణం లేకుండా పడి ఉండటాన్ని చూసి ఆ సోదరి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టడం చూపరులను కలచివేసింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న శివ (28) రాఖీ పండుగ సందర్భంగా మణుగూరుకు వచ్చాడు. శివ వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు తరచూ వేధిస్తుండగా, గతంలో శివ ఆ గ్యాంగ్‌ను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న MK గ్యాంగ్ హెడ్ రమ్మీ మరియు అతని అనుచరులు, మాట్లాడుదామని చెప్పి శివను స్థానిక ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిపించారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న శివపై MK గ్యాంగ్‌కు చెందిన సుమారు 30 మంది యువకులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వారు జరిపిన దాడిలో శివ ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అడ్డు వెళ్లిన ఉదయ్ కుమార్ అనే మరో యువకుడిపై కూడా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు మణుగూరులో ఈ MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు సృష్టిస్తోందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హింసిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 80 మంది సభ్యులున్న ఈ గ్రూప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.