యాదాద్రి భువనగిరి, నవంబర్ 13, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన చారిత్రక రాచకొండ కోట వైభవాన్ని జిల్లా కలెక్టర్‌కు రాచప్ప సమితి సభ్యుడు సురపెల్లి వెంకటేష్ వివరించారు. రాచకొండను సందర్శించిన కలెక్టర్‌కు కోటలోని ప్రాచీన కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపద, పురాతన ద్వారాలు, ఆనాటి రాజుల పాలనా విధానాలు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన చారిత్రక విశేషాలను ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రాచకొండ కోటకు ఉన్న శతాబ్దాల చరిత్రను, నాటి పాలకుల పరిపాలనా దక్షతను, యుద్ధ వ్యూహాలను వివరిస్తూ అక్కడి శిలా నిర్మాణాల ప్రత్యేకతను తెలియజేశారు. కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు, భారీ బండరాళ్లతో రూపొందించిన కోట ద్వారాలు ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి, శిల్పకళా వైభవానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. రాచకొండ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని, తెలంగాణ చారిత్రక సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని అన్నారు. ఇలాంటి అపురూపమైన చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
రాచకొండ చారిత్రక ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాచకొండ చరిత్ర, ప్రాచీన కట్టడాల విశిష్టతను కలెక్టర్‌కు వివరించిన సురపెల్లి వెంకటేష్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.