న్యూఢిల్లీ, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భారత క్రికెట్ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఆయన అధికారికంగా భారతీయ జనతా పార్టీ (భాజపా) తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే చాహల్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. భాజపా నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీలో ఆయనను 'ప్రత్యేక ఆహ్వానితుడిగా' (స్పెషల్ ఇన్వైటీ) నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
జాతీయ ఓబీసీ మోర్చాలో కీలక నియామకాలు: భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా జాతీయ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. అంతకుముందు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో చాహల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విడుదలైన జాబితాలో ఢిల్లీ తరఫున చాహల్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఓబీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు చాహల్ చేరిక పార్టీకి ఎంతో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏడుగురు జాతీయ ఉపాధ్యక్షులు, ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు జాతీయ కార్యదర్శులతో పాటు 37 మంది జాతీయ కార్యవర్గ సభ్యులను నియమించారు. ఇందులో తెలంగాణ నుంచి కడగంచి రమేష్ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. కాగా, 1990లో జన్మించిన చాహల్, ఇటీవలే టీ20 క్రికెట్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.