రాజగోపాల్ రెడ్డిని విమర్శించే అర్హత సామెల్‌కు లేదు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరంటోతు శ్రీను నాయక్

Published on: 25 Jul 2026, 04:19 PM
News Article

నారాయణపురం, జూలై 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నిరాధార విమర్శలు చేసే అర్హత సామెల్‌కు లేదని నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరంటోతు శ్రీను నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని, యావత్తు తెలంగాణ ప్రజలు ఆయన వైపు చూస్తున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు.

గతంలో టికెట్ ఇప్పించమని రాజగోపాల్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగి బతిమాలుకున్న విషయం, ఆయన సహకారం వల్లే తాను గెలిచానని స్వయంగా మీడియాతో చెప్పిన విషయం సామెల్ మర్చిపోయారేమోనని ఎద్దేవా చేశారు. తనకు సాయం చేసిన వ్యక్తిపైనే దుమ్మెత్తిపోయడం ఆయన నీచపు బుద్ధికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మందుల సామెల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని శ్రీను నాయక్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.