రామోజీరావు ఆస్తులు జప్తు చేస్తాం!

Published on: 05 May 2026, 05:29 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సంచలనం సృష్టిస్తున్న 'మార్గదర్శి ఫైనాన్సియర్స్' కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన మరియు సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ వ్యవహారంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ సంస్థకు కర్త, కర్మ, క్రియగా ఉన్న రామోజీరావు గారు ఇటీవల కన్నుమూశారని, కాబట్టి ఈ కేసును ఇక ముగించాలని కోరారు.

అయితే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. "ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ సంస్థ చేసిన తప్పులు మాసిపోవు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి చనిపోయిన వ్యక్తితో అంతం కావు. ఒకవేళ బాధితులకు అన్యాయం జరిగిందని తేలితే, రామోజీరావు గారి ఆస్తులను జప్తు చేసే అధికారం మాకు ఉంది. ఆ ఆస్తులను విక్రయించి అయినా సరే బాధితులకు డబ్బులు పంపిణీ చేస్తాం" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వ్యక్తిగత హోదాలతో సంబంధం లేకుండా బాధితుల ప్రయోజనాలే పరమావధి అని కోర్టు పేర్కొంది. ఇప్పటికే బాధితులకు డబ్బు చెల్లించామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఆ చెల్లింపుల వివరాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్రమంలో ఈ వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ చైర్మన్ చెరుకూరి కిరణ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన కౌంటర్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని న్యాయస్థానం హెచ్చరించింది. బాధితులకు జరిగిన అన్యాయంపై పక్కా రిపోర్టుతో రావాలని సూచిస్తూ, తదుపరి విచారణను జూలై 15వ తేదీకి వాయిదా వేసింది.