రూ. 30 కోట్ల భారీ స్కామ్..అసలేం జరిగిందంటే?

Published on: 02 Apr 2026, 03:52 AM
News Article

నాగోల్: లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభం అంటూ అమాయక ప్రజలను ఆకర్షించి కోట్లలో ముంచిన ముఠా గుట్టును నాగోల్ పోలీసులు రట్టు చేశారు. సుమారు 290 మంది బాధితుల నుండి 30 కోట్ల రూపాయలు వసూలు చేసి, చివరికి బోర్డు తిప్పేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

బండ్లగూడకు చెందిన కిచ్చ వీరభద్రరావు (51), తన భార్య రాజ్యలక్ష్మి మరియు సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్‌తో కలిసి నాగోల్‌లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో “వీరభద్ర ట్రేడింగ్” పేరుతో ఒక ఆఫీసును ప్రారంభించారు.

  • ఆశ చూపిన వైనం: లక్ష రూపాయల పెట్టుబడిపై నెలకు రూ. 10 వేల వడ్డీ (10% వడ్డీ) ఇస్తామని నమ్మబలికారు.
  • నమ్మకం కోసం: మొదట్లో కొంతమందికి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి, వారి ద్వారా మరికొంత మందిని చేర్పించుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 30 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

ట్విస్ట్ ఇక్కడే..

2025 మేలో వీరభద్రరావుపై గుర్గావ్‌లో ఒక సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో వీరి అసలు రంగు బయటపడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిందితులు, మొత్తం 30 కోట్లలో సగం మాత్రమే చెల్లించి, మిగిలిన 15 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది.

నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. "అధిక లాభాల ఆశ చూపే సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.