రేవంత్, బండి సంజయ్ ఒక్కటయ్యారా? RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్య‌లు

Published on: 10 May 2026, 03:37 PM
News Article

(హైదరాబాద్ న్యూస్‌టైమ్ - పొలిటికల్ బ్యూరో): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో విస్తుపోయే నిజాలను వెల్లడించిన బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. నిందితుడిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ వ్యవస్థీకృతంగా కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసులోని లోతుపాతులను బట్టబయలు చేశారు.

బాధితురాలే నిందితురాలా? మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగితే, బాధిత తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మే 8వ తేదీ సాయంత్రం 6 గంటలకే బాధితులు స్టేషన్‌కు వెళ్తే, రాత్రి 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా వేధించారని మండిపడ్డారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ అంగీకారంతో జరిగినా అది నేరమే అవుతుందని తెలిసినా, బండి సంజయ్ తన అధికారాన్ని ఉపయోగించి బాధితులను నిందితులుగా చిత్రించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయకుండా, కరీంనగర్ పోలీసుల ద్వారా ఉల్టా వారిపైనే కేసులు పెట్టించడం దారుణమన్నారు.

బండి సంజయ్ బెదిరింపులు.. మధ్యవర్తిగా జర్నలిస్ట్? ఈ కేసును నీరుగార్చేందుకు బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులను భయపెట్టారని ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. "నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు" అంటూ బాధితులను సంజయ్ హెచ్చరించారని తెలిపారు. బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారని, బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్‌తో పాటు సంజయ్, సంగప్పల ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ – బండి ‘మిత్రధర్మం’: కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నేతను కాపాడటంపై ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. "రేవంత్ రెడ్డి బండి సంజయ్‌ను, బండి సంజయ్ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసుల నుండి రక్షణ కోసమే ఈ రాజీ రాజకీయం నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఈ అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సూటి ప్రశ్నలు వేశారు. "మోదీ గారు.. మీ సభలో వేలాది మంది మహిళలు కూర్చుంటారు. మీ పక్కనే ఉండే కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు ఉన్నా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ మహిళలకు మీరేం సమాధానం చెబుతారు?" అని నిలదీశారు. నిర్మల్ పోలీసులు వాస్తవాలు దాస్తున్నారని, నిందితుడికి సహకరిస్తున్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.