రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్రో రెండో దశకు బ్రేక్: కేటీఆర్ తీవ్ర ధ్వజం

Published on: 15 Jun 2026, 12:51 PM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, రాజకీయ విభాగం: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు దక్కకపోవడం సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు భయం వల్లే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని, అందుకే 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, అలాగే మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28 శాతం పనులను కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిందని.. కానీ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రికార్డు స్థాయిలో 72 శాతం పనులను పూర్తి చేసి మెట్రోను అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థపై బెదిరింపులకు దిగడంతో ఆ సంస్థ వెళ్ళిపోయిందని, ప్రస్తుతం మెట్రో రైల్ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.