రేవంత్ సర్కార్‌కు హైకోర్టు షాక్!
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026 హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వివాదాస్పద జీవో నంబర్ 7పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని గతంలో కాలేజీ యాజమాన్యాలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఈ జీవో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది.
ఫీజు బకాయిలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కాబట్టి జీవోపై సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు.. "మాటలు కాదు, ముందు విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో స్పష్టంగా తెలపండి" అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ, తదుపరి విచారణను జూన్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించాలని కోర్టు స్పష్టం చేసింది.