రేవంత్ సర్కార్‌పై క‌విత‌ తీవ్ర విమర్శలు

Published on: 08 Apr 2026, 01:35 PM
News Article

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర భవిష్యత్తు, చరిత్రను మార్చే రోజుగా ఏప్రిల్ 25 నిలుస్తుందని, ఆ రోజున కొత్త పార్టీని ప్రకటించి ఈ గడ్డకు కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 'నడిగడ్డ హక్కుల పోరాట సమితి' అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన 1000 మంది అనుచరులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం ఆమె ప్రసంగించారు.

  • కొత్త తరహా రాజకీయాలు: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు నడిచే రాజకీయం చేస్తామని, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో రూపొందిస్తున్న ఎజెండాను ఏప్రిల్ 25న ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజల కోసం త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
  • ఢిల్లీకి గులాంగిరీ: తెలంగాణకు స్వయం పాలన వస్తుందనుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నేతలకు ఘోరంగా గులాంగిరీ చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. "రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి భయంతో నిలబడి మాట్లాడుతున్నారు. తన కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి సంచులు మోస్తున్నారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు.
  • ఏటీఎంగా తెలంగాణ: దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తున్నారని, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు.
  • మోడీ నిర్ణయాలపై గప్‌చుప్: అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోతుందని, అయినా సీఎం రేవంత్ రెడ్డి మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • గద్వాల్ గడీలో ఉద్యమకారుల జెండా: గద్వాల్ జిల్లాలో 70 ఏళ్లుగా గడీల కుటుంబాల వల్ల ప్రజలు నష్టపోయారని, అక్కడ ఇక ఉద్యమకారుల జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.

కవితక్కకు బీఆర్ఎస్ కుట్ర చేసింది: గొంగళ్ల రంజిత్ కుమార్ కవితక్కకు మాట ఇస్తే ఎంత కష్టమైనా వెనక్కి తగ్గనని రంజిత్ కుమార్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షాన పోరాడుతున్న కవితక్కను బీఆర్ఎస్ కుట్ర చేసి బయటకు పంపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.