రైతును ముంచిన ఉల్లి: 50 కిలోల బస్తా కేవలం 200 రూపాయలే!

Published on: 22 Apr 2026, 11:11 AM
News Article

హైదరాబాద్/వికారాబాద్: రుచికరమైన వంటకాల్లో రారాజుగా వెలిగే ఉల్లి.. నేడు సాగు చేసిన రైతు కళ్ళల్లో కన్నీరు మిగిల్చింది. మార్కెట్‌లో కనీస మద్దతు ధర లేక, ఆశించిన ఆదాయం రాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా వికారాబాద్ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే.. అక్కడ క్వింటాల్‌కు కేవలం రూ. 150 నుంచి రూ. 300 మాత్రమే ధర పలుకుతోంది.

రవాణా ఛార్జీలు కూడా రావడం లేదు: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ గంజ్‌కు పంటను తరలిస్తే, వాహనాల అద్దెలు మరియు హమాలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి వంటి స్థానిక సంతల్లో 50 కిలోల బస్తాను కేవలం రూ. 200లకే తెగనమ్ముకుంటున్నారు. కిలో ఉల్లి ధర కేవలం రూ. 3 నుంచి రూ. 4 మాత్రమే పలుకుతుండటంతో పెట్టుబడి మాట అటుంచితే, కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం దెబ్బ.. ధర లేక తిప్పలు: మరోవైపు అకాల వర్షాలు రైతులను మరింత దెబ్బతీశాయి. తడిసిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేక, దొరికిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. పంచలింగాల, పట్లూర్, కంచర్‌పల్లి, మొగిలిగుండ్ల తదితర గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ఉల్లిని తెచ్చి కారుచౌకగా విక్రయిస్తూ కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి రైతును ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.