రైతులకు ఆర్బీఐ గుడ్ న్యూస్..

Published on: 20 Jun 2026, 04:30 PM
News Article

ముంబై, జూన్ 20 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక తీపికబురు అందించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం మార్గదర్శకాలను సవరిస్తూ.. వ్యవసాయం మరియు దానికి అనుబంధ రంగాలకు తీసుకునే రూ. 2 లక్షల లోపు రుణాలకు ఎలాంటి పూచీకత్తు (Collateral Security) లేదా మార్జిన్ అడగకూడదని బ్యాంకులన్నింటికీ ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ రూ. 2 లక్షల లోపు రుణాలకు రైతులు తమ ఇష్టపూర్వకంగా బంగారం లేదా వెండిని తాకట్టు పెడితే.. దాన్ని నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక రూ. 2 లక్షలకు పైబడిన రుణాలకు మాత్రం ఆయా బ్యాంకులు తమ సొంత క్రెడిట్ పాలసీల ప్రకారం పూచీకత్తులు అడగవచ్చని తెలిపింది. మరోవైపు, భూమి విలువతో సంబంధం లేకుండా చిన్న రైతుల కనీస అవసరాల కోసం (పంట ఖర్చులు, వ్యవసాయ పరికరాలు) రూ.10,000 నుండి రూ. 50,000 వరకు 'ఫ్లెక్సీ కేసీసీ' (Flexi KCC) పేరుతో సులభమైన రుణ పరిమితిని మంజూరు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక, హామీలు పెట్టలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న లక్షలాది మంది పేద రైతులకు సులభంగా రుణాలు దొరికే అవకాశం ఏర్పడింది.