రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు: సుర్వి యాదయ్య గౌడ్
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వ్యవసాయ బావులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు మహాధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కనీసం 8 గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యల కారణంగా మోటార్లు, పంపుసెట్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. లో-వోల్టేజ్ ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ బిక్షం, చిలువేరు బిక్షపతి, బొడ్డుపెళ్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, ఉపల ఆంజనేయులు, పాలకూర్ల సతీష్ గౌడ్, డాక్టర్ ఎర్రోళ్ల లింగస్వామి, రాసాల వెంకటేశం, చిలువేరు శంకర్, ఎడ్ల సత్తయ్య యాదవ్, ఎర్రోళ్ల వెంకటేష్, చిలువేరు వెంకటేశం, బొమ్మగోని రమేష్ గౌడ్, పవన్ కళ్యాణ్, నేనావత్ జగ్గు, మారగోని వెంకటేశం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.