రోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తప్పక తెలుసుకోవాల్సిందే!
హైదరాబాద్, ఆగస్ట్ 20, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రతిరోజూ చక్కెర కలిపిన కూల్ డ్రింక్స్ లేదా సోడాలు తాగే అలవాటు ఉందా? అయితే తక్షణమే ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ప్రాణాంతకమైన కడుపు క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) వచ్చే ప్రమాదం రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని తాజా శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని ప్రముఖ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ టి. చాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ పరిశోధన వివరాలు 'గ్యాస్ట్రో హెప్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. రోజుకు కనీసం ఒక కూల్ డ్రింక్ (సుమారు 237 మి.లీ) తాగే వ్యక్తులతో, అసలు అలాంటి డ్రింక్సే ముట్టుకోని వారితో పోల్చి చూస్తే.. వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు ఏకంగా 2.45 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ ప్రమాదం పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ కనిపిచింది. ముఖ్యంగా రోజుకో కూల్ డ్రింక్ తాగే మహిళల్లో కడుపు క్యాన్సర్ వచ్చే ముప్పు సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉండగా, పురుషులలో రెట్టింపు రిస్క్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఆర్టిఫిషియల్ స్వీటనర్లు (కృత్రిమ తీపి పదార్థాలు) వాడే డ్రింక్స్ వల్ల ఇలాంటి క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు ఈ అధ్యయనంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. శరీరంలో బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వాపులు (inflammation), హార్మోన్ల అసమతుల్యత, డీఎన్ఏ దెబ్బతినడం వంటి పలు కారణాల వల్లే ఈ రకమైన దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్, ఊబకాయం మరియు గుండె జబ్బులకు కారణమవుతున్న షుగర్ డ్రింక్స్.. ఇప్పుడు నేరుగా క్యాన్సర్ ముప్పునకు కూడా దారితీస్తుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.