లండన్‌లో ఎలుకలు దొరికితే ‘సీజ్’.. మనకాడ దొరికితే ‘మామూలు’!..

Published on: 27 Jun 2026, 01:15 PM
News Article

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): బ్రిటన్‌లోని బిర్మింగ్‌హామ్ నగరంలో ఉన్న ‘మామా షీర్యాఖ్’ (Mama Sheeryakh) అనే ఒక ఫేమస్ అఫ్గానిస్తాన్ రెస్టారెంట్‌లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న దారుణాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. జూన్ 24న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కిచెన్ అంతా ఎలుకల మలమూత్రాలు, అత్యంత దారుణమైన అపరిశుభ్రత బయటపడటంతో.. లండన్ అధికారులు ఏమాత్రం దాక్షిణ్యం లేకుండా ఆ హోటల్‌కు తక్షణమే తాళాలు వేయించి ‘హైజీన్ ఎమర్జెన్సీ’ నోటీసులు బోర్డుకు తగిలించారు. ఎలుకల బెడదను పూర్తిగా వదిలించి, కలుషితమైన ఫుడ్ మొత్తాన్ని పారేసి, హోటల్ అంతా క్లీన్ అండ్ డిసిన్‌ఫెక్ట్ చేసేంత వరకు ఆ షట్టర్ తీసే ప్రసక్తే లేదని లండన్ అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఈ లండన్ ఉదంతం చూసిన మన భాగ్యనగరం జనాలు.. "ఇదే మన ఇండియాలో, మన హైదరాబాద్‌లో అయితే కథ వేరేలా ఉండేది" అంటూ లోకల్ సిస్టమ్‌పై మండిపడుతున్నారు. మన దగ్గర గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ లాంటి ఏరియాల్లోని బడా హోటళ్లలో రోజుకో చోట కుళ్లిన చికెన్, ఫ్రీజర్లలో బొద్దింకలు, పురుగులు దొరుకుతున్నా మళ్లీ కథ మొదటికే వస్తోంది. మన అధికారులు హడావుడిగా వచ్చి కెమెరాలకు ఫోజులిచ్చి నోటీసులు ఇస్తారు తప్ప.. వారం తిరక్కుండానే సదరు హోటళ్లు లోపాయికారీ ఒప్పందాలు, మామూళ్ల కక్కుర్తితో మళ్లీ యథేచ్ఛగా తెరుచుకుంటున్నాయి. ఒకే హోటల్‌లో రిపీటెడ్ గా కల్తీలు జరుగుతున్నాయంటే అది అధికారుల ‘చూసి చూడనట్టు’ వదిలేసే నిర్లక్ష్యమే కారణమని, లండన్ అధికారుల లాగా కఠినంగా యాక్షన్ తీసుకునే దమ్ము మన సిస్టమ్‌కు ఎప్పటికి వస్తుందని జనాలు కడిగిపారేస్తున్నారు.