లక్నో కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం: పైనుంచి దూకేసి 11 మంది విద్యార్థుల మృతి
లక్నో, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులు అవుతారనుకున్న విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారు. లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ కమ్ముకున్నాయి. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఏ దారీ కనిపించక.. ఏకంగా భవనం మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్) పైనుంచి కిందకు దూకేశారు. ఈ హృదయ విదారక ఘటనలో తీవ్రంగా గాయపడిన 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన మిగతా విద్యార్థులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘోర దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.