లేడీ ఎస్ఐ స్కూటీ తాళాలు ఇవ్వడమే పాపమైందా?

Published on: 20 May 2026, 04:19 PM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్, సికింద్రాబాద్: నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ (ACB) అధికారులకు మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, రైటర్ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఉదంతం నగర పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనే కారణంతో సహాయం కోసం అభిషేక్ అనే యువకుడు బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ కేసును డీల్ చేస్తున్న మహిళా ఎస్ఐ నందిత.. కౌన్సిలింగ్ పేరుతో పిలిపించి భారీగా డబ్బు డిమాండ్ చేసింది. అందుకు అభిషేక్ నిరాకరించడంతో, కక్షగట్టిన ఎస్ఐ.. తండ్రిని కొట్టాడంటూ సదరు యువకుడిపైనే తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపింది. అనంతరం జైలు నుండి బెయిల్‌పై విడుదలైన అభిషేక్, కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం స్టేషన్‌లో సంతకం చేయడానికి వస్తుండగా.. రైటర్ విజయ్ రూ. 10 వేలు, ఎస్ఐ నందిత మరో రూ. 30 వేలు లంచం ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్ఐ నందిత తన స్కూటీ తాళాలు ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టాలని బాధితుడికి సూచించగా.. ముందే వ్యూహం రచించిన ఏసీబీ అధికారులు, డబ్బులు డిక్కీలో పెట్టగానే ఎస్ఐ నందితతో పాటు రైటర్ విజయ్‌ను నడిరోడ్డుపై ఆధారాలతో సహా పట్టుకున్నారు.