లోన్ రికవరీపై ఆర్‌బీఐ సంచలన నిర్ణ‌యం!

Published on: 21 May 2026, 10:17 AM
News Article
  • ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టేలా కొత్త రూల్స్
  • నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులే జరిమానా కట్టాలి!
  • అక్టోబర్ 1 నుండి అమల్లోకి.. కస్టమర్ల ప్రైవసీపై..
  • రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు


హైదరాబాద్ న్యూస్ టైమ్, జాతీయ డెస్క్: బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుండి తీసుకున్న రుణాలు (లోన్లు) సకాలంలో చెల్లించనప్పుడు, రికవరీ ఏజెంట్లు చేసే అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. పర్సనల్, కార్ లేదా హోమ్ లోన్ బకాయిల పేరుతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను లాక్ చేయడం, ఫీచర్లను నిలిపివేయడం లాంటి చర్యలకు ఇకపై బ్యాంకులు పాల్పడకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ సదరు మొబైల్ లేదా టాబ్లెట్ కొనుగోలు కోసమే బ్యాంక్ లోన్ ఇచ్చి ఉండి, ఆ బకాయి 90 రోజుల గడువు దాటితేనే ఫోన్‌పై ఆంక్షలు విధించే హక్కు ఉంటుంది. అప్పుడు కూడా ఇంటర్నెట్, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర సేవలను నిలిపివేయకూడదు. కస్టమర్ బకాయి చెల్లించిన గంటలోనే ఫోన్ అన్‌లాక్ చేయాలని, ఆలస్యమైతే గంటకు రూ. 250 చొప్పున బ్యాంకే కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది. మరోవైపు, లోన్ రికవరీ కోసం ఏజెంట్లు చేసే అన్ని కాల్స్, ఆడియో, టెక్స్ట్ సంభాషణలను బ్యాంకులు రికార్డ్ చేసి భద్రపరచాలని ఆర్‌బీఐ ఆదేశించింది. కస్టమర్లను అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరించడం, వారి వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధించడం లాంటివి చేస్తే బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ముసాయిదా నిబంధనలపై మే 31 వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించి, అక్టోబర్ 1 నుండి వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. సామాన్య రుణగ్రహీతలకు రక్షణగా మారబోతున్న ఈ ఆర్‌బీఐ కొత్త రూల్స్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి.

గమనిక: ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా మరియు నమ్మకమైన వార్తలను మీ మొబైల్‌లో నేరుగా పొందేందుకు.. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుండి మన 'హైదరాబాద్ న్యూస్ టైమ్' (Hyderabad NewsTime) అప్లికేషన్‌ను ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోండి.
👇 యాప్ డౌన్‌లోడ్ లింక్: ఇక్కడ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి