వంట బాగులేదని కుక్‌పై దాడి?.. ఐపీఎల్ స్టార్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు!
భోపాల్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భారత ఐపీఎల్ (IPL) ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్‌తో పాటు ఆయన తండ్రి, మధ్యప్రదేశ్ మాజీ స్పెషల్ డీజీ (రిటైర్డ్ IPS) శైలేష్ సింగ్‌లపై భోపాల్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమ ఇంట్లో వంటమనిషిగా (Cook) చేరిన విపేంద్ర సింగ్ తోమర్ (31) అనే వ్యక్తిపై శారీరకంగా దాడి చేసి, బూతులు తిడుతూ, గదిలో బంధించారనే తీవ్ర ఆరోపణలపై భోపాల్‌లోని రాతీబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసులో క్రికెటర్, ఆయన తండ్రితో పాటు వారి వ్యక్తిగత డ్రైవర్ మిశ్రాను కూడా నిందితుడిగా చేర్చారు. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 25న నెలకు రూ.15,000 జీతంతో ఆయన వీరి ఇంట్లో వంటమనిషిగా చేరాడు. అయితే చేరిన మొదటి రోజు నుంచే వంట నాణ్యతపై వారు గొడవ పడటం మొదలుపెట్టారని, అతని మొబైల్ ఫోన్‌ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. జూన్ 28న ఉదయం టిఫిన్ వడ్డించిన తర్వాత తన ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించారని, దీంతో తాను పని మానేసి ఊరికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఆగ్రహానికి గురైన తండ్రీకొడుకులు, డ్రైవర్‌తో కలిసి తన గదిలోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భయంతో గదిలో దాక్కున్నప్పటికీ తలుపులు తెరిచి మరీ కొట్టారని, పైగా ఇక్కడ ఉన్నందుకు ఖర్చుల కింద రూ.1,000 ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని వెల్లడించాడు. బాధితుడి ముఖం, శరీరంపై గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో పోలీసులు వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 296(a), 115(2), 3(5) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను క్రికెటర్ శశాంక్ సింగ్ తోసిపుచ్చారు. సదరు వంటవాడు మద్యం మత్తులో ఉండగా తన తల్లి పట్టుకుందని, అందుకే పనిలో నుంచి తీసేయడంతో కక్షతో తమపై అబద్ధపు కేసులు పెడుతున్నాడని ఆయన క్లారిటీ ఇచ్చారు.