వంటవాడి దాడి కేసుపై స్పందించిన ఐపీఎల్ స్టార్ శశాంక్.. దొంగతనం కోసమే వచ్చాడంటూ వ్యాఖ్యలు!
భోపాల్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తమ ఇంట్లో వంటమనిషిగా (Cook) చేరిన వ్యక్తిపై దాడి చేసి, బూతులు తిట్టారనే ఆరోపణలపై భోపాల్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) వ్యవహారంపై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. తాము ఎవరినీ బంధించలేదని, సదరు వ్యక్తి అసలు వంటవాడే కాదని, తమ ఇంట్లో దొంగతనం చేసే ఉద్దేశంతోనే వచ్చాడని శశాంక్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. "అతను వంటమనిషినని చెప్పి మా ఇంట్లో చేరిన మాట నిజమే కానీ, అతనికి అసలు వంటే రాదు. ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ప్రవర్తించాడు. మా ఇంట్లో, చివరికి నా వ్యక్తిగత రూమ్‌లోకి కూడా వచ్చి వీడియోలు, ఫోటోలు తీశాడు. అతని ప్రవర్తన చూస్తుంటే ఏదో దొంగతనం చేసే ఆలోచనతోనే వచ్చినట్లు మాకు అనుమానం కలిగింది. అయితే మేం అదృష్టవశాత్తూ చెక్ చేసుకుంటే ఇంట్లో ఏ వస్తువూ పోలేదు. అతని ఫోన్‌లో మా ఇంటికి సంబంధించిన చాలా ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉండటంతో మా అమ్మ వాటన్నింటినీ డిలీట్ చేయించింది" అని వివరించారు.
అలాగే, "అతను ఫోటోలు తీస్తూ దొరికిపోయినప్పుడు మా చెల్లెలు 100 నంబర్‌కు డయల్ చేద్దామని చెప్పింది. కానీ అతను బ్రతిమిలాడటంతో నేనే వదిలేశాను. నా గురించి తెలిసిన ఎవరికైనా తెలుసు.. నేను ఇలాంటి గొడవలకు, భౌతిక దాడులకు ఎంత దూరం ఉంటానో. నేనేదో సెలెబ్రిటీని కాబట్టి నాపై ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. నేను కనీసం బూతులు మాట్లాడటానికే వెనుకాడతాను, అలాంటిది ఇక దాడి చేయడం అనేది అసలు జరగని పని. దీనిపై నేను ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పోలీసులు కూడా మమ్మల్ని సంప్రదించలేదు" అని క్రికెటర్ శశాంక్ సింగ్ క్లారిటీ ఇచ్చారు.