విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత

Published on: 08 May 2026, 04:13 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 08, 2026

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని వేర్లతో సహా పెకిలించేందుకు పోలీస్ శాఖ చర్యలను మరింత ఉధృతం చేసింది. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు లేదా కళాశాలల ఆవరణలో ఎక్కడైనా డ్రగ్స్ పట్టుబడితే, దానికి ఆ విద్యాసంస్థ యాజమాన్యాలనే పూర్తి బాధ్యులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు డ్రగ్స్ వాడితే తమకు సంబంధం లేదని యాజమాన్యాలు చేతులు దులుపుకోవడం ఇకపై సాగదని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల లోపల జరిగే ప్రతి అంశంపై యాజమాన్యం నిరంతరం నిఘా ఉంచాలని, క్యాంపస్ లోకి మాదకద్రవ్యాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణలో భాగంగా సరికొత్త నిబంధనలను డీజీపీ ప్రకటించారు. విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే సమయంలోనే "మేము ఎటువంటి మాదకద్రవ్యాలు వాడము" అని వారితో పాటు వారి తల్లిదండ్రుల నుండి కూడా రాతపూర్వక డిక్లరేషన్ తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించారు. దీనివల్ల విద్యార్థుల్లో బాధ్యత పెరగడమే కాకుండా, ముందస్తు హెచ్చరికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల సరఫరాదారులు విద్యాసంస్థలనే టార్గెట్ చేస్తున్నారని, ఈ ముఠాల ఆటకట్టించేందుకు యాజమాన్యాలు పోలీసులతో సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే యాజమాన్యాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని, అవసరమైతే విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు కూడా సిఫార్సు చేస్తామని డీజీపీ హెచ్చరించారు.