వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
చిత్తూరు, జూలై 16, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో వెలుగుచూసింది. తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ (హోసూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి)కు, కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి మౌలికశ్రీ (1) అనే కుమార్తె ఉంది. అయితే, మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్తున్నామని బయల్దేరిన ఈ కుటుంబం రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో, హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, మొదట భర్త, పాపతో హాసిని బైక్ మీద వెళ్లడం, తిరుగు ప్రయాణంలో రమేష్ లేకపోగా హాసిని తన ప్రియుడు యుగంధర్ మరియు అతని స్నేహితులతో కలిసి అదే బైక్ మీద వెళ్లడం గమనించారు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం.. హాసిని ఉద్దేశపూర్వకంగా తన పర్స్ కింద పడేసి, అది తీసుకోవాలని రమేష్‌ను పంపింది. అక్కడ కాపుకాస్తున్న ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు కలిసి రమేష్‌ను హతమార్చి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశారు. అనంతరం రమేష్ బైక్‌పైనే ప్రియుడితో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన హాసిని పరారైంది. పోలీసులు సాక్ష్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టి మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహాన్ని గుర్తించి, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.