వైద్య రంగంలో తెలుగు మహిళా డాక్టర్ సంచలనం..

Published on: 28 Jun 2026, 09:03 AM
News Article

హైదరాబాద్, జూన్ 28 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు, మదర్ హాస్పిటల్స్ (Mother Hospitals) వ్యవస్థాపకురాలు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపును దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని ‘ది పార్క్’ హోటల్‌లో ఘనంగా నిర్వహించిన ‘ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ & సమ్మిట్ 2026’ వేదికగా ఆమెకు ‘ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2026’ (India's Most Trusted IVF Specialist of the Year) అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా డాక్టర్ ప్రశాంతి రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

వేలాది కుటుంబాల్లో ‘సంతాన’ కాంతులు: సంతానలేమి సమస్యతో దశాబ్దాలుగా బాధపడుతున్న వేలాది దంపతులకు అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక ఐవిఎఫ్ (IVF) వైద్య సేవలను అందిస్తూ, అత్యధిక సక్సెస్ రేటుతో ఎన్నో కుటుంబాల్లో ఆమె సంతోషాన్ని నింపారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, బాధితులకు నమ్మకమైన, పారదర్శకమైన చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రశాంతి రెడ్డి నిరుపమాన సేవలను గుర్తించి ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల వైద్య వర్గాలు, తోటి వైద్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు కురిపిస్తున్నారు. ఈ పురస్కారం ఆమె నిరంతర వైద్య సేవలకు లభించిన నిజమైన గుర్తింపు అని కొనియాడారు.