"వైద్యులారా జాగ్రత్త! తప్పుడు రిపోర్ట్ ఇస్తే కోటి కట్టాల్సిందే" 🚨

Published on: 10 May 2026, 01:10 PM
News Article

(హైదరాబాద్ న్యూస్‌టైమ్ - ఆదిలాబాద్ బ్యూరో): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు అంధుడిగా జన్మించిన ఘటనలో జిల్లా వినియోగదారుల కమిషన్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. బాధితురాలికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.34 వేలు చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది?: ఆదిలాబాద్‌కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన గర్భధారణ సమయంలో స్థానిక వైద్యుల వద్ద క్రమం తప్పకుండా స్కానింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో స్కానింగ్ నివేదికల్లో శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, కాన్పు తర్వాత పుట్టిన శిశువుకు రెండు కళ్లు లేకపోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వైద్యులు స్కానింగ్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించడంలో వైఫల్యం చెందారని, తప్పుడు నివేదికలు ఇచ్చారని బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ ఘాటు తీర్పు: ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. స్కానింగ్ అనేది శిశువు లోపాలను గుర్తించడానికే అని, దాన్ని సరిగ్గా నిర్వహించకుండా తల్లిదండ్రులను మోసం చేయడం క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. బాధితురాలికి కలిగిన మానసిక వేదన, శిశువు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.కోటి పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించారు. వైద్య రంగంలో ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చే సెంటర్లకు ఈ తీర్పు ఒక హెచ్చరిక అని పలువురు అభిప్రాయపడుతున్నారు.