శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ భరోసా!

Published on: 05 May 2026, 02:46 PM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో మనస్తాపానికి గురై ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మంగళవారం బాధితుడి నివాసానికి వెళ్ళిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ పక్షాన రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులు, కార్మికులు బలి అవుతున్నారని విమర్శించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పిల్లల చదువులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మికులు ఎవరూ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతుందని పిలుపునిచ్చారు. ఈ పరామర్శలో పలువురు పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.