శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాల కలకలం: 20 మంది మహిళల అరెస్ట్!

Published on: 02 Jul 2026, 04:53 AM
News Article

హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, తనిఖీలు చేపట్టిన అధికారులు వారి వద్ద ఉన్న వీసాలు నకిలీవని గుర్తించి తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసు ఔట్‌పోస్టుకు అప్పగించారు. ఈ క్రమంలో తాము ఒక ఏజెంట్‌ను నమ్మి మోసపోయామని, అతను ఇచ్చిన నకిలీ వీసాలతోనే ప్రయాణానికి సిద్ధమయ్యామని ఆ మహిళలు కన్నీటి పర్యంతమవుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఏజెంట్ ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.