సంస్థాన్ నారాయణపురం ఎంఆర్ఓకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, డీఎస్పీ వినతిపత్రం
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 2 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల తహసీల్దార్‌కు (MRO) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు డీఎస్పీ నాయకులు వినతి పత్రం అందజేశారు. డీఎస్పీ జిల్లా కార్యదర్శి ఏర్పుల సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటం వల్ల సుమారు 30 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో ఫీజులు చెల్లించలేని దుస్థితిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, కొందరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల బకాయిల సమస్య రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, డీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లింగస్వామి, జలంధర్, మండల నాయకులు నకిరేకంటి సందీప్, ఎర్ర సాయి, శివాజీ, రామకృష్ణ, శ్రీకాంత్, నరేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.