సంస్థాన్ నారాయణపురం నూతన ఎస్సై సీత పాండును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సీత పాండును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రాచకొండ రమేష్ బాబు, మహమ్మదాబాద్ గ్రామ 5వ వార్డు మెంబర్ దంటిక అశోక్ కుమార్ యాదవ్ ఎస్సైను కలిసి పుష్ప్‌గుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సీత పాండు మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాయ రోగాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, చక్కటి లక్ష్యాలతో తమ భవిష్యత్తును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.