సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం రైతు వేదికలో మంగళవారం సాగు భూమి సంరక్షణ (కేత్ బచావో అభియాన్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి. పూజ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు. భూసార పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. పీఎస్బీ, రైజోబియం, ట్రైకోడెర్మా వంటి జీవ ఎరువులతో పాటు పచ్చిరొట్ట ఎరువులను విస్తృతంగా వినియోగించాలని కోరారు. వీటి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించవచ్చని వివరించారు.
ఆత్మ కమిటీ సభ్యుల ఎన్నిక, సన్మానం: ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ (ATMA) పథకానికి సంబంధించి నారాయణపురం ప్రాంతం నుంచి జిల్లా స్థాయి కమిటీ సభ్యులుగా నలుగురు ఎంపికయ్యారు. రాచకొండ రమేష్ (నారాయణపురం), సూర్కంటి రంగారెడ్డి (చిమిర్యాల), ఎర్ర వెంకటేష్ (గుజ్జ), కొర్ర పరెంగ (రాచకొండ) లను కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రైతులు, వ్యవసాయ శాఖ మధ్య వారధిగా ఉంటూ సేవ చేసే అవకాశం లగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ వంతు పూర్తి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, ఎఫ్పీవో చైర్మన్ జక్కిడి మధుసూదన్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు సైదులు, నవ్య, త్రివేణి, రాజేశ్, అనురాధ, స్థానిక రైతులు ఏపూరి సతీష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.