సామాన్య ప్రేక్షకుడికి ఊరట: సింగిల్ స్క్రీన్లలో పెరగని టికెట్ ధరలు!
- జీవో ఉన్నా రేట్లు పెంచం
- ప్రేక్షకులకు శిరీష్ రెడ్డి కీలక భరోసా
(హైదరాబాద్ న్యూస్‌టైమ్ - ఫిలిం డెస్క్): తెలంగాణ సినీ ప్రేక్షకులకు ఇది శుభవార్త. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెరగవని థియేటర్ల యజమానుల ప్రతినిధి శిరీష్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి జీవో ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకుడిపై భారం మోపడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.
ప్రేక్షకులే మా ప్రాధాన్యత: "ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంచుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కానీ, మేము సింగిల్ స్క్రీన్లలో పాత ధరలనే కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే మా లక్ష్యం. పెరిగిన ధరల వల్ల సినిమా చూసే వారి సంఖ్య తగ్గకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని శిరీష్ రెడ్డి తెలిపారు.
గత కొంతకాలంగా పెరిగిన టికెట్ ధరల వల్ల సామాన్య కుటుంబాలు థియేటర్లకు రావడానికి వెనుకాడుతున్న నేపథ్యంలో, సినిమా ఇండస్ట్రీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మల్టీప్లెక్స్ రేట్లు భరించలేని వారికి సింగిల్ స్క్రీన్లు ఇకపై బెస్ట్ ఆప్షన్‌గా మారనున్నాయి.