సికింద్రాబాద్ లో రూ. 1.22 కోట్ల హవాలా నగదు పట్టివేత!
హైదరాబాద్ న్యూస్‌టైమ్: ముంబై నుండి సికింద్రాబాద్‌కు రైలు మార్గంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న భారీ హవాలా నగదును గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బలగాలు సంయుక్తంగా పట్టుకున్నాయి. విశ్వసనీయ సమాచారంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో బొల్లారం - మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల మధ్య జరిపిన తనిఖీల్లో, మహారాష్ట్రకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తా అనే వ్యక్తి వద్ద నుండి ఎలాంటి ఆధారాలు లేని రూ. 1,22,70,000 (కోటి 22 లక్షల 70 వేలు) నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కాంతా జ్యువెలర్స్ నుండి సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని మరో జ్యువెలరీ వ్యాపారికి కేవలం రూ. 5,000 కమీషన్ కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పోలీసులు నగదుతో పాటు నిందితుడి ఫోన్, టికెట్లను సీజ్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును ఆదాయపు పన్ను (IT) శాఖకు బదిలీ చేస్తున్నారు.