సీఎం ఆఫీస్ తరహాలోనే కావాలి.. ఇద్దరు సీనియర్ మంత్రుల ఖరీదైన కోరిక!
హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో (Telangana Secretariat) ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తరహాలోనే తమకూ అత్యంత విలాసవంతమైన డిస్‌ప్లే స్క్రీన్స్ కావాలంటూ మంత్రులు పట్టుబడుతున్న సరికొత్త ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉన్నట్లుగానే తమ వ్యక్తిగత కాన్ఫరెన్స్ హాళ్లలో కూడా హై-ఎండ్ ఎల్ఈడీ (LED) స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఇద్దరు సీనియర్ మంత్రులు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ అప్పటికే ఉన్న సాధారణ టీవీలను పక్కన పెట్టేసి, ఏకంగా రూ.1 కోటి భారీ ప్రజాధనంతో సరికొత్త మెగా ఎల్ఈడీ స్క్రీన్స్‌ను బిగించారు.
ఒక్కో స్క్రీన్‌కు 50 లక్షలు.. క్యూ కడుతున్న మిగతా మంత్రులు: ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించే డిజిటల్ స్క్రీన్స్ తరహాలోనే తమ చాంబర్లలో కూడా లుక్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఇద్దరు మంత్రులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్లో అత్యంత ఖరీదైన ఈ అధునాతన ఎల్ఈడీ స్క్రీన్స్ కోసం ఒక్కొక్క దానికి దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరు ఏర్పాటు చేసుకున్న స్క్రీన్స్‌ను చూసి.. ఇప్పుడు సచివాలయంలోని మరికొందరు మంత్రులు కూడా "మాకు కూడా సీఎం ఆఫీసు తరహాలోనే ఎల్ఈడీ స్క్రీన్స్ కావాల్సిందే" అంటూ తమ శాఖల అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. దీంతో ఈ అనవసరపు ఆడంబరాల ఖర్చుపై సచివాలయ ఉద్యోగ, ప్రజా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.