సీఎం రేవంత్ రెడ్డి గెలుపుపై కల్వకుంట్ల కవిత సంచలన ట్విస్ట్!
హైదరాబాద్, జూన్ 29 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చాలా అనుమానాలున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌లో డూప్లికేట్, కర్ణాటక ఓట్లతోనే గెలిచారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, కొడంగల్ నియోజకవర్గంలో కర్ణాటక ఓటర్లు ఉన్నారంటూ పలు ఆధారాలను సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచారు. కర్ణాటక నుండి తెలంగాణ ఎన్నికలకు కేవలం డబ్బు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్‌ఫర్ చేశారా? అంటూ ఆమె తీవ్ర సందేహం వ్యక్తం చేశారు.
కొడంగల్‌లో ఈసీ ఫేవర్ చేసిందా?: కవిత మాట్లాడుతూ.. తన నియోజకవర్గమైన బోధన్‌లో ఏడాదిన్నర కాలంలో ఏకంగా 7 వేల ఓట్లను తొలగించిన ఈసీ, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో మాత్రం కేవలం 800 ఓట్లు మాత్రమే ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. కొడంగల్‌లో 2018 నుండి 2023 నాటి ఎన్నికల వరకు 30 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయని, అందులో 22 వేలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తాము గుర్తించామన్నారు. ఇవి కాకుండా కర్ణాటకకు చెందిన సెడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ జాబితాలో రిజిస్టర్ అయి ఉన్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, అంటే పక్క రాష్ట్రం ఓట్లు, డూప్లికేషన్ ఓట్లే ఆయనను గెలిపించాయని స్పష్టమవుతోందని, ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఈసీ ఫేవర్ చేసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఒక వ్యక్తికి రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండే ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను ఏరివేసే మెకనిజం ఈసీ వద్ద ఉందా అని ప్రశ్నిస్తూ.. దేశంలో 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వన్ ఓటు' అనే పక్కా విధానం ఉండాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.