సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట నూతన పాలక మండలి
హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యులు బుధవారం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన బోర్డు సభ్యులు, తమకు బాధ్యతలు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పాలక మండలి చైర్మన్ శ్రీ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు, సభ్యులు ఎమ్మెల్యే శ్రీ వినోద్ వెంకటస్వామి, శ్రీమతి కొణిదెల సురేఖ, శ్రీమతి విజయ రాజం, శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, శ్రీమతి స్వాతి కాంతమనేని, శ్రీ ఎం. రాఘవేందర్ రావు మరియు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్ర సమగ్ర అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ముఖ్యమంత్రి నూతన పాలక మండలికి పలు కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రతిష్టను మరింత పెంచేలా, భక్తులకు ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ సేవలు అందించేలా పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.