హైదరాబాద్, అక్టోబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ హైకోర్టు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన ఓ కీలక కేసులో సంచలన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్న అభియోగంతో ప్రముఖ పోలీసు అధికారి, సీపీ సజ్జనార్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినప్పటికీ, భవానీనగర్ ఎస్‌ఐ మరియు సీఐ తన చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారని, అంతేకాకుండా కళ్లల్లో కారం చల్లి వేధించారని ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై అతను పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయితే, ఉన్నతాధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు నేరుగా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, బాధ్యులైన అధికారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆ సమయంలో సీపీ సజ్జనార్‌ను ఆదేశించారు. న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సజ్జనార్ ఎలాంటి విచారణ జరపలేదని మరియు చర్యలు తీసుకోలేదని బాధితుడు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.