సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ - ఎస్సై పాండు
హైదరాబాద్, ఆగస్ట్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - సంస్థాన్ నారాయణపురం): సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చని సంస్థాన్ నారాయణపురం ఎస్సై పాండు అన్నారు. ఆదివారం నారాయణపురం మండల కేంద్రంలో వర్తక సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి షాపు యజమాని తమ వ్యాపార కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎక్కడైనా చోరీలు జరిగితే నిందితులను సులభంగా గుర్తించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కేవలం షాపుల లోపలే కాకుండా, షాపు వెనుక భాగం మరియు రోడ్డు పూర్తిగా స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనల ప్రకారం 25 మంది షాపు యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు వంగరి రఘు, కోశాధికారి సురక్షితం, సభ్యులు తెలంగాణ బిక్షం, ఉప్పల వెంకటేష్, చిలువేరు శంకర్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.